Friday, November 7, 2014

ITIR లో తెలంగాణా స్థానికులకు రిజర్వేషన్లు ఉండవు, స్పష్టంచేసిన ప్రభుత్వం

హైదరాబాదు నగరంలో ఐటిఐఆర్ ప్రాజెక్టు రాబోతోంది. ఐతే ఇందులో లభించే ఐటి ఉద్యోగాలలో తెలంగాణా స్థానికులకు రిజర్వేషన్లు ఉండవని టిఆర్ ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విభజనతో హైదరాబాదులో ఉద్యోగాలు కోల్పోతామన్న వారి ఆందోళనను ప్రభుత్వ ప్రకటన సంతృప్తినివ్వవచ్చు. అయితే తెలంగాణా వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయనుకున్న స్థానిక యువతకు ప్రభుత్వ ప్రకటన నిరాశ పరచవచ్చు.

ప్రయివేటు రంగంలో వచ్చే ఈ ఐటి ఉద్యోగాలను స్థానికులకు రిజర్వేషన్లివ్వడం సాధ్యం కాదని తెలంగాణా ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఎలాంటి నైపుణ్యం లేని ఉద్యోగాలూ, సెమీ స్కిల్ డ్ ఉపాధి అవకాశాలలో మాత్రం స్థానికులకు ఓ మేరకు అవకాశం లభించేలా యత్నిస్తామని ప్రభుత్వం చెప్పింది.

ఐటి ఐఆర్ ద్వారా పదిహేను లక్షల మందికి ప్రత్యుకంగానూ మరో 50 లక్షల మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుందని అంచనా. 

Wednesday, November 5, 2014

2శాతం నిధులతో తెలంగాణాలో విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించగలరా?

తెలంగాణా రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని వుంది. ఈ బడ్జెట్ లో విద్యుత్ రంగానికి ప్రణాళికా వ్యయం క్రింద వెయ్యికోట్లు మాత్రమే కేటాయించారు. ఇది మొత్తం ప్రణాళికా వ్యయంలో 2శాతం మాత్రమే.

ఇంత తక్కువ కేటాయింపులతో విద్యుత్ సంక్షోభాన్ని తీర్చగలమా? అయితే ఇవి తెలంగాణా జెన్ కో కు చేసిన కేటాయింపుల ప్రయివేటు రంగంలో కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అని ప్రభుత్వం సమాధానం చెప్పేవచ్చు.
(ప్రొఫెసర్.కె.నాగేశ్వర్)

17 శాతం లోటుతో తెలంగాణాలో లక్షకోట్ల బడ్జెట్

లక్షకోట్లతో తెలంగాణా రాష్ట్ర తొలి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. పొరుగురాష్ట్రమైన ఆంథ్రప్రదేశ్ తో పోటీ పడుతూ తెలంగాణా ప్రభుత్వం కూడా బడ్జెట్ ను లక్ష కెోట్లను దాటించింది. అయితే మొత్తం బడ్జెట్ లోనే కాదు. లోటులోనూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తెలంగానా సర్కార్ పోటీ పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులొస్తాయన్న ఆశతో బడ్జెట్ లో భారీ అంచానాలు చేసింది. తెలంగాణా ప్రభుత్వం కూడా అదే పని చేసింది. తెలంగాణా బడ్జెట్ లో ద్రవ్యలోటు 17 శాతం గా వుంది. ఇది రాష్ట్ర ఆదాయంలో సుమారు 5శాతం. ఈ లోటును  పూడ్చుకోలేక పోతే చేసిన అంచనాలలో కోత తప్పదు.

(ప్రొఫెసర్.కె.నాగేశ్వర్)

కెసిఆర్ ఐదేళ్ళ పాలనలో లక్షమంది పేదలకే ఇళ్ళు కడతారా?

కెసిఆర్ అత్యంత ఇష్టమైన పథకాలలో పేదల గృహనిర్మాణ పథకం ముఖ్యమైనది.  కాంగ్రెస్ సర్కార్ చిన్న గదితో ఇల్లుకడుతోంది. పేదవాడి ఇంటికి అల్లుడొస్తే ఎలా? అంటూ కెసిఆర్ ఎన్నికల ప్రచారంలో ఖతర్నాక్ ప్రశ్నలడిగారు.

ప్రతిపేదవాడికీ మూడున్నర లక్షలతో రెండు బెడ్రూమ్ లతో ఇల్లు కట్టిస్తానన్నారు. ఇందుకు బడ్జెట్ లో వెయ్యికోట్లు కేటాయించారు. ఈ లెక్కన ఏడాదిలో 30లోపు పేదలకే ఇల్లుకట్టిస్తారు. అంటే ఐదేళ్ళలో లక్షన్నర పేదలకు మాత్రమే తెలంగాణాలో సర్కారీ ఇండ్లు వస్తాయి. ఇది కూడా చేసిన కేటాయింపులు నిలిస్తేనే


( ప్రొఫెసర్.కె.నాగేశ్వర్)

ఈ కేటాయింపులతో దళితుల భూపంపిణీ పథకం అమలు కావాలంటే 50 ఏళ్ళు పడుతుంది.

 దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కెసిఆర్ ఎన్నికలకు ముందే మాట మార్చారు. కానీ భూమిలేని ప్రతిదళితునికీ మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఒక దళితుడు ముఖ్యమంత్రి అవ్వడం కన్నా లక్షలాదిమంది పేదదళితులకు బతికేందుకు ఆధారం దొరుకుతుంది కదా అని చాలా మంది అభినందించారు. కానీ ప్రణాళిక లోపం ప్రతిష్టాత్మక భూపంపిణీ పథకాన్ని వెక్కిరిస్తోంది. తెలంగాణ లోని ప్రతిమండలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని తొలుత ప్రకటించారు. తెలంగాణా మొత్తంలో 429 గ్రామీణ మండలాలున్నాయి. ఇందులో పదిలక్షల దళిత కుటుంబాలున్నాయని అంచనా. అందులో కనీసం సెంటుభూమి కూడా లేని కుటుంబాలు రెండు లక్షల తొంభయి వేలుంటాయని అంచనా. వీరికి భూపంపిణీ పథకం అమలు చేయాలన్నా సుమారు తొమ్మిది లక్షల ఎకరాల భూమి కావాలి. మూడెకరాల లోపు భూమి వున్నవారికి మిగిలిన భూమి ప్రభుత్వం ఇస్తుందని కూడా కెసి ఆర్ హామీ ఇచ్చారు. అంటే ఎకరమున్న పేదదళితునికి మిగిలిన రెండెకరాలు ప్రభుత్వం ఇస్తుంది. ఇది కూడా కలుపుకుంటే కెసిఆర్ భూపంపిణీ పథకం అమలు కావాలంటే, పదిలక్షల ఎకరాలకు పైగా భూమి కావాలి. 

చెరువుల పునరుజ్జీవంతో నవతెలంగాణాకు నాంధి

క్రీస్తుశకం 12 మరియు 13వ శతాబ్ధంలోనే తెలంగాణలో వాటర్ షెడ్ల వ్యవస్థను కాకతీయులు పరిచయం చేసారు. 1960వ దశకం వరకూ కూడా చెరువుల ద్వారానే తెలంగాణా ప్రాంతంలోని 60 శాతం భూములకు సాగునీరందేది. ప్రస్తుతం ఇది కేవలం 9 శాతానికి పడిపోయింది. ఫలితంగా కరెంటు బోర్లతో తెలంగాణా రైతు కష్టాలు పడాల్సి వస్తోంది. తెలంగాణా ప్రాంతంలో 80శాతం వ్యవసాయం ఇప్పుడు ఈ బోర్లు, బావుల క్రిందనే సాగవుతున్నాయి.

తెలంగాణాలోని కృష్ణా గోదావరి బేసిన్ లో 265 టియంసి ల నీటిని నిల్వచేసుకునేందకు అవకాశం వుంది. ఇందుకు కారణం తెలంగాణలో మొత్తం 45వేల చెరువులు వున్నాయి. రాష్ట్రప్రభుత్వం ఐదేళ్ళలో ఈ చెరువులకు పునర్వైభవం కల్పించే భారీ ప్రణాలికను షురూ చేసింది.

ప్రస్తుతం బడ్జెట్ లో 9 వేల చెరువులను పునరుద్ధరించేందుకు భారీగా 2000 కోట్లను కేటాయించింది.

(ప్రొఫెసర్.కె.నాగేశ్వర్)

జాతీయ తలసరి ఆదాయాన్ని మించిన తెలంగాణా తలసరి ఆదాయం ?

2013-14లో జాతీయ తలసరి ఆదాయం 74,920 రూపాయిలు కాగా తెలంగాణాలో 93,151 రూపాయిలుగా వుంది. ఈ గణాంకాలను తెలంగాణా తొలి బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి ఈటెల రాజెందర్ చెప్పారు.

అయితే ఇది చూసి తెలంగాణా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యిందని అనుకునే ప్రమాదం వుంది. వాస్తవ పరిస్థితి అర్ధంకావాలంటే జిల్లాల వారీ తలసరి ఆదాయాలను పరిశీలించాలి.

జిల్లాల వారీగా తలసరి ఆదాయంలో తీవ్ర వ్యత్యాసం వుంది. ఉదాహరణకు మూడు జిల్లాల్లో మాత్రం తలసరి ఆదాయం జాతీయ సగటుకన్నా ఎక్కువగా వుంది. ఇక మిగిలిన ఏడు జిల్లాల్లో తలసరి ఆదాయం జాతీయ సగటుకన్నా తక్కువగా వుంది.

కేంద్రం  వెనుకబడిన ప్రాంతాలలో అమలు చేసే BRGF పథకం క్రింద తెలంగాణాలోని 9 జిల్లాలు వస్తున్నాయి. దీనిని బట్టి తెలంగాణాలో వెనుకబాటు తనాన్ని అర్ధం చేసుకోవచ్చు. హైదరాబాదు నగరాన్ని చూసి తెలంగాణా అంతా అభివృద్ధి అయ్యిందన్న భావన సరైంది కాదనటానికి ఈ గణాంకాలే సాక్ష్యం.

(ప్రొఫెసర్.కె.నాగేశ్వర్)