Thursday, July 31, 2014

అసలు ప్రధాని సోనియానేనా? ఫైళ్ళు ఆమెకు ముందు పోయాయా?

మన్మోహన్ సింగ్ దేశ ప్రధాని అయినా కూడా చాలా విషయాలలో డమ్మీగానే ఉండాల్సి వచ్చిందన్నది తరచూ వినిపించే విమర్శ. మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు  ‘అనుకోకుండా అయిన ప్రధాని’  అనే పుస్తకంలో ఇదే విషయాన్ని రాసారు. సోనియా గాందీయే నేరుగా నిర్ణయాలు తీసుకునేది. ఆమెయే ఫైళ్ళు నేరుగా చూసేది అని ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు కొద్ది నెలల క్రితం సంచలనాన్ని కలిగించింది. తన ఆత్మకథలో నట్వర్ సింగ్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ప్రధాని చూడాల్సిన ఫైళ్ళు కూడా ముందుగా సోనియా ఇంటికి వెళ్ళాయని నట్వర్ సింగ్ తన పుస్తకంపై కరణ్ థాపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పదవిలోకి రాకుండానే అధికారాన్ని అనుభవించారన్న విమర్శలు సోనియాపై పెరగనున్నాయి. ప్రభుత్వ ఫైళ్ళను, అందులోను ప్రధాన మంత్రి చూడాల్సిన ఫైళ్ళను బయటి వారు ఎవరైనా చూడడం నిబంధనలకు కూడా వ్యతిరేకం.  

ఈయన భారత ప్రధాని పదవినే వదులుకున్నారట

నట్వర్ సింగ్ ఆత్మకథ దేశ రాజకీయాలలో హల్ చల్ చేస్తోంది. ఇందిరా, రాజీవ్ కుటుంబాలకు సన్నిహితుడిగా ఆ తర్వాత కాలంలో పార్టీ నుంచి బహిష్క్రుతుడైన నట్వర్ సింగ్ ఆ కుటుంబానికి చెందిన అనేక రహస్యాలను పుస్తకంలో బయటపెట్టారు. రాజీవ్ హత్యానంతరం ప్రధాని బాధ్యతలను చేపట్టాలని సోనియా గాంధీని కాంగ్రేస్ వర్కింగ్ కమిటీ కోరింది. ఆమె అందుకు నిరాకరించింది. అప్పుడు ఎవరి పేరునైనా సూచించమని పార్టీ ఆమెనే కోరింది. పి ఎన్ హక్సర్ సలహా మేరకు ఆమె అప్పటి ఉప రాష్ట్రపతి శంకర్  దయాళ్ శర్మ పేరును సూచించింది. సోనియా తరపున నట్వర్ సింగ్, అరుణా అసఫ్ అలీ లు శంకర్ దయాళ్ శర్మ వద్దకు వెళ్ళి సోనియా నిర్ణయాన్ని తెలిపారట. అందుకు శంకర్ దయాళ్ శర్మ నిరాకరించారట, తన ఆరోగ్యం, వయస్సు ప్రధాన మంత్ర పదవికి సరిపోదని శర్మ బదులు చెప్పారట. కాటికి కాలు చాపిన వయస్సులో కూడా సర్పంచ్ పదవిని కూడా వదులుకోని నేటి కాలంలో శంకర్ దయాళ్ శర్మ నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. 

రాహుల్ భయం వల్లనే సోనియా ప్రధాని పదవి తీసుకోలేదా?

మాజీ విదేశాంగ మంత్రి గాంధీల కుటుంబానికి గతంలో సన్నిహితులుగా ఉన్న నట్వర్ సింగ్ పుస్తకం కొత్త వివాదాన్ని రేపింది. 2004 లోను, 2009 లోను ప్రధాని పదవి తీసుకునేందుకు అవకాశం ఉండి కూడా సోనియా త్యాగం చేసారని ఇప్పటి వరకు కాంగ్రేస్ నేతలు చెప్తూ వచ్చారు. కానీ, ఇది నిజం కాదు. సోనియా త్యాగం చేయలేదు. తన తండ్రి లాగానే తల్లికి ఏమైనా జరుగుతుందని రాహుల్ గాంధీ భయపడ్డాడు. ప్రధాని పదవిని తీసుకోవద్దని తల్లి పై ఒత్తిడి తెచ్చారు అంటూ నట్వర్ సింగ్ తన పుస్తకంలో రాసి బాంబు పేల్చారు. దీనితో త్యాగ సిద్ధాంతం గాలికి పోతుందని కాంగ్రేస్ నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

అయితే ఇరాక్ నుంచి చమురు కొనుగోళ్ళ విషయంలో ఆరోపణలు రావడంతో నట్వర్ సింగ్ ను కాంగ్రేస్ పార్టీ గతంలోనే బహిష్కరించింది. ఆ కోపంతోనే నట్వర్ సింగ్ ఇలా రాసారు. దీనిని నమ్మవలిసిన అవసరం లేదని కాంగ్రేస్ నేతల వాదిస్తున్నారు. 

ఎం ఎల్ ఎ క్వార్టర్స్ లో కూడా ఆంధ్ర, తెలంగాణ పంచాయితీ

నీళ్ళు, ఫీజులు, విద్యుత్తు ఇవి దాటి ఇప్పుడు చివరకు ఆంధ్ర, తెలంగాణ పంచాయతీ ఎం ఎల్ ఏ క్వార్టర్స్ కు చేరింది. ఎం ఎల్ ఏ క్వార్టర్స్ ని మొదటి బ్లాక్ ని ఆంధ్రప్రదేశ్ కు, రెండవ బ్లాక్ తెలంగాణకు కేటాయించారు. ఆంద్రప్రదేశ్ బ్లాక్ లో ఉన్న తెలంగాణ ప్రజా ప్రతినిధులను ఖాళీ చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసు  జారీ చేసింది. నోటీసులిస్తారా అని తెలంగాణ నేతలు తప్పు పడ్తున్నారు. సామరస్యంగా చెప్పాల్సింది పోయి నోటీసులా అంటూ తెలంగాణ నేతలు గుర్రుమంటున్నారు. తెలంగాణకు కేటాయించిన బ్లాక్ లోని ఆంధ్రప్రదేశ్ నేతలు కూడా ఖాళీ చేయడం లేదంటున్నారు తెలంగాణ క్వార్టర్స్ కేటాయింపు కమిటీ చైర్మన్ రామలింగా రెడ్డి. ఇందుకు సి కె బాబును ఉదాహరణగా కూడా చెప్పారు. దీనతో ఖాళీ చేయని ఆంధ్రప్రదేశ్ ఎం ఎల్ ఏలకు క్వార్టర్స్ కు మంచి నీళ్ళు, విద్యుత్తు కనెక్షన్లు ఆపి వేస్తామని తెలంగాణ కమిటీ అంటోంది. ఎవరిది తప్పు అన్నది పక్కకు పెడ్తే మొత్తం మీద తెలుగు వారి పరువు మాత్రం బజారు కెక్కుతోంది. ఈ క్వార్టర్స్ విషయమే రెండు తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోకపోతే ఇక నీరు, నిధులను, ఉద్యోగులు ఇలా పెద్ద పెద్ద అంశాలు ఎక్కడి నుంచి పరిష్కరించుకోగలుగుతారు.ఇప్పటికైనా గవర్నర్ ఇందుకో యంత్రాంగాన్ని నెలకొల్పాలి. 

Wednesday, July 30, 2014

మీ జేబులో ఉన్న వేయి, ఐదు వందల నోట్లు అసలైనవేనా? మీరు తీసుకుంటున్నవి, ఇస్తున్నవి ఒరిజనల్‌ నోట్లేనా?

క్షణాల్లో కోటీశ్వరులను చేస్తాం.  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మా సొంతం.  వాటర్‌ మార్క్‌, సిల్వర్‌ లైన్‌.. అన్నీ ఉంటాయి.  మీరు ఒకటి ఇస్తే  నాలుగు  ఇస్తాం.   ఆలసించిన ఆశాభంగం.... ఇది ప్రస్తుతం కృష్ణాజిల్లా కేంద్రంగా... జోరుగా నడుస్తున్న దందా....                         

  మీ జేబులో ఉన్న వేయి, ఐదు వందల నోట్లు అసలైనవేనా? మీరు తీసుకుంటున్నవి, ఇస్తున్నవి ఒరిజనల్‌ నోట్లేనా? ఎందుకైనా మంచిది ఒక్కసారి సరిచూసుకోండి. లేదంటే నిండా మునిగిపోతారు. అవును కృష్ణా జిల్లా కేంద్రంగా నకిలీ నోట్ల దందా జోరుగా సాగుతోంది. పెట్రోల్ బంక్ , సూపర్ మార్కెట్ , హాస్పిటల్‌.. ఎక్కడైనా మీకు నకిలీ నోట్లు.

తిరుమల వెంకన్న దర్శనానికి వెళుతున్నారా.... అయితే మీ పని గోవిందే.

శుభమా అని దేవుని వద్దకు వెళుతుంటే ఇవేం అపశకునం మాటలు అనుకోవచ్చు. ఏ చిన్న అనారోగ్యం సమస్య వచ్చినా బతికి బయటపడేందుకు అక్కడ మందులే లేవు. పొరపాటున పెద్ద ఆరోగ్యసమస్యే వచ్చిపడిందనుకో... ఇక అంతే సంగతులు.

కోరికలు తీర్చే కలియుగ దైవమంటూ తిరుమల వెంకన్న వద్దకు వెళితే అక్కడ నెలకొన్న పరిస్థితులు భక్తులను భయపెడుతున్నాయి. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్లుగా తయారైంది తిరుమల క్షేత్రం. భక్తులకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా వారికి తక్షణం చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన అక్కడి ఆసుపత్రుల్లో పల్లెటూర్లలో సైతం దొరికే పారసిటమాల్ వంటి మాత్రలు తప్ప మరేమి దొరకటం లేదు. బిపి, షుగర్, గుండె జబ్బులున్న పేషంట్లు వెళితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొండ దిగి రుయా ఆసుపత్రికి పరుగులు తీయాల్సిందే.

బాబు గారి బడ్జెట్ కొంచెం ఢిఫరెంట్

ఈసారి ప్రత్యేకంగా ఉండాలి. అన్నింటికన్నా డిఫరెంట్‌గా కనిపించాలి. భారమైనా సరే..భిన్నంగానే ఉండాలి. పైసలు ఖర్చయినా పర్వాలేదు పొగడ్తలు మాత్రం కురవాలి. అన్నదాతలకు అండగా ఉండాలి. బీసీలను బుజ్జగించాలి. ఇదీఆంద్రప్రదేశ్  ముఖ్యమంత్రి గారి బడ్జెట్‌ ఐడియా.
విభజన తర్వాత తొలిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌..గతం కన్నా భిన్నంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా కేటాయింపులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. బీసీలకు, రైతులకు ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.